మహనీయుల తిరుగుబాట్లే మనకు స్ఫూర్తిః ప్రధాని మోడీ

ఈ 75 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామన్న మోడీ

YouTube video
PM Narendra Modi Addresses Nation From The Iconic Red Fort l PMO

న్యూఢిల్లీః స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను కొనియాడారు. బానిస సంకెళ్ల నుంచి దేశానికి స్వేచ్ఛను అందించేందుకు వారు చేసిన పోరాటం అనుపమానమన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి వారు మనకు మార్గదర్శకులన్నారు. మహనీయుల తిరుగుబాట్లే మనకు స్ఫూర్తి అన్న ప్రధాని.. దేశం కోసం ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యజించారన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని, ఈ అమృత మహోత్సవం వేళ భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఈ వేళ మనకు త్యాగధనుల బలిదానాలను స్మరించుకునే అదృష్టం కలిగిందన్నారు. మన ముందున్న మార్గం కఠినంగా ఉందని, లక్ష్యాల సాధన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. బానిసత్వంలో భారతీయత అనే భావన గాయపడిందని, ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ దేశం నిలిచి గెలిచిందన్నారు. స్వచ్ఛ భారత్, ఇంటింటికి విద్యుత్ సాధన అంత తేలికైన విషయం కాకున్నా లక్ష్యాలను వేగంగా చేరుకునేలా దేశం ముందడుగు వేస్తోందన్నారు.

యువత స్టార్టప్‌లతో ముందుకొస్తోందన్నారు. మూలాలు బలంగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమేనని మోడీ వివరించారు. మహాత్ముని ఆశయాలకు, భారతీయులందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాలు ప్రజల ఆశలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. దేశం నలుమూలలా అభివృద్ధి కాంక్ష రగిలిపోతోందన్నారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాలం మనకు ఎంతో ప్రధానమైనదని మోడీ పేర్కొన్నారు. బానిస మనస్తత్వాన్ని తుదముట్టించి, సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలని మోడీ ఆకాంక్షించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/