అన్ని వర్గాల వారు భాషా పరిరక్షణకు పూనుకోవాలి: పవన్ కల్యాణ్

నేడు గిడుగు రామ్మూర్తి జయంతి

pawan-kalyan-responds-on-telugu-language-day

అమరావతిః తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేడు ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. భావితరాలకు తెలుగు భాషను వారసత్వ సంపదగా అందించేలా అందరూ సంకల్పించాలని, తద్వారా తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత చేకూర్చుదామని పిలుపునిచ్చారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా…. తెలుగువాళ్లం అని చెప్పుకోవడంలో భావోద్వేగం, సోదరభావం వ్యక్తమవుతాయని తెలిపారు. అందుకు ఆలంబన మన భాషేనని పేర్కొన్నారు. అటువంటి అమ్మ భాషను మనందరం అనునిత్యం గౌరవించాలని వెల్లడించారు.

గ్రాంథికంలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల బాట పట్టించి, వ్యావహారిక భాషకు పట్టంకట్టిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారు అని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యావహారిక తెలుగు భాష అందాన్ని, విలువను గుర్తించి ఆ భాషను రచనల్లోకి తీసుకువచ్చేందుకు గిడుగు రామ్మూర్తి ఉద్యమ స్ఫూర్తితో చేసిన కృషి కారణంగానే మన భాష విరాజిల్లుతోందని పవన్ కల్యాణ్ వివరించారు. విద్యార్థి దశ నుంచే మన భాషను బాలలకు నేర్పించాలని, ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే సాగాలన్న కేంద్ర ప్రభుత్వ విద్యావిధానాన్ని విస్మరించకూడదని స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/