మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Mlc Kavitha urges all parties to unite and pass the Women’s Reservation Bill

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి మహిళా బిల్లుపై గళమెత్తారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని అన్ని రాజకీయ పార్టీలకు కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ రాజకీయ పార్టీలకు లేఖ రాశారు. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, చట్టసభల్లో సరిపడా మహిళల ప్రాతినిధ్యం ఉంటేనే దేశం పురోగమిస్తుందని లేఖలో కవిత అభిప్రాయపడ్డారు.

‘చారిత్రక ముందడుగు వేయడానికి ప్రజాప్రతినిధులకు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఒక మంచి అవకాశం. రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏకమై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్​లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు చొరవ తీసుకోవాలి. దేశంలో మహిళల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినా.. చట్టసభల్లో మాత్రం మహిళల ప్రాతినిధ్యం సరిపడా లేదు. ఈ వైరుద్యం దేశ పురోగతికి విఘాతం కలిగిస్తోంది. ప్రజాస్వామ్య సూత్రాలను బలహీన పరుస్తుంది.’ అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.