ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

న్యూఢిల్లీః బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు వెళ్లారు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లేముందు పార్టీ శ్రేణులకు, మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు.
కాగా, ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న తన తండ్రి నివాసం నుంచి ఆమె ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. కెసిఆర్ నివాసం వెలుపల భారీ సంఖ్యలో ఉన్న బిఆర్ఎస్ శ్రేణులు కవితకు అనుకూలంగా నినాదాలు చేశారు. కవిత భర్త అనిల్, లాయర్ మోహన్ రావు కూడా ఆమెతో పాటు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం 10 వాహనాల కాన్వాయ్ తో కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.