నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్

నిమ్స్ వైద్య బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. యూరాలజీ విభాగం వైద్యులు 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరపడం దేశంలో ఇదే మొదటిసారి. తక్కువ సమయంలోఎక్కవ సర్జరీలు చేసే వెసులుబాటు, అత్యాధునిక వైద్యసౌకర్యాలు చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్‌ తరువాత నిమ్స్‌లోనే ఉండడం విశేషం. ప్రతి ఆరు గంటలకు ఒక కిడ్నీ మార్పిడి చొప్పున 17 మంది వైద్యుల బృందంతో కలిసి 24గంటల్లో మూడు కడావర్‌, ఒకటి లైవ్‌ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిపినట్టు యూరాలజి అండ్‌ రీనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రొఫెసర్స్‌ డాక్టర్‌ రామిరెడ్డి, డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ తెలిపారు.

ఈ తరుణంలో ఈ అరుదైన శస్త్రచికిత్సలను చేసిన వైద్య బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. ” వాట్ ఏ బ్యూటిఫుల్ న్యూస్ హైదరాబాద్లోని నిమ్స్ వైద్యులు 24 గంటలలో నాలుగు కిడ్నీలు మార్పిడి చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు అద్భుతమైన సేవలను అందిస్తున్నాయి. సిబ్బంది అందరికీ నా అభినందనలు ” అని ట్వీట్ చేశారు. గత కొన్నేండ్లుగా డయాలసిస్‌పై జీవిస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఖలీల్‌ అహ్మద్‌ (41), కరీంనగర్‌ జిల్లాకు చెందిన సాత్విక (22), హైదరాబాద్‌కు చెందిన సంతోష్‌ కుమార్‌ (29), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకటలక్ష్మి (48) కిడ్నీ మార్పిడి చేసారు.