హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదు – మంత్రి కొట్టు సత్యనారాయణ

హిందూ సంస్కృతి గురించి పవన్‌కు ఏం తెలుసు..? హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా..? అని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని.. దళారీ వ్యవస్థకు తావు లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. వివాహ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్‌ చదువుతున్నాడని మండిపడ్డారు.

“నీకు హిందూ ధర్మంపై నమ్మకం లేదు.. నీ తల్లి పూజ చేస్తే నీ తండ్రి సిగరెట్ కాల్చాడని చెప్పావు” అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరో పేపర్ మీద రాసిస్తే చదివే పెయిడ్ ఆర్టిస్టు నువ్వు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం కిరాయికి మాట్లాడుతున్నావని పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసే స్థోమత ఉన్న వారు కూడా స్వామివారి మీద భక్తితో పిల్లలకు అన్నవరంలో వివాహం చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్నవరంలో సరాసరి ఏడాదికి ఏడు లక్షల వ్రతాలు, 4 వేల వివాహాలు జరుగుతాయని తెలిపారు. ఆలయంలో జరిగే పెళ్లిళ్లకు ఆలయ నిర్వాహకులు బాధ్యులు కాదని పేర్కొన్నారు. అన్నవరంలో దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని, వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఈ చర్యతో బ్రోకర్ల పనులకి అడ్డుకట్ట పడటంతో.. వీళ్లంతా పవన్ కళ్యాణ్ సంప్రదించారని అన్నారు.