‘వచ్చే ఎన్నికల్లో గుడ్‌ బై బాబు’ అంటారంటూ అంబటి రాంబాబు ఎద్దేవా

‘‘గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బైబై అన్నారు.. వచ్చే ఎన్నికల్లో గుడ్‌ బై బాబు అంటారు’’ అంటూ వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవే నాకు చివరి ఎన్నికలు.. మీరు గెలిపించి పంపిస్తే సరే లేదంటే ఇక మీ ఇష్టం అంటూ చంద్రబాబు పత్తికొండలో నిర్వహించిన సభలో భావోద్వేగానికి గురై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ దారితీసాయి. అధికారం లేకపోతే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు అంటూ కొందరు అంటుంటే.. మరికొందరు నిజంగానే చంద్రబాబు రాజకీయాల నుండి పక్కకు జరిగితే, జనసేన పార్టీకి బాగా కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటె వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు వ్యాఖ్యల ఫై స్పందించారు. ఓటమిని చంద్రబాబు ఏడాదిన్నర ముందే అంగీకరించారని అన్నారు. ‘‘గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బైబై అన్నారు.. వచ్చే ఎన్నికల్లో గుడ్‌ బై బాబు అంటారు’’ అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం సహా 175 సీట్లలో గెలుస్తాం. చంద్రబాబుకు 40 ఏళ్ల అనుభవం చివరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడటానికే ఉపయోగపడింది. ఆయన మానసికంగా ఫిట్‌గా లేరు. అది ఆయన మాటలు, చేష్టల ద్వారానే తెలుస్తూనే ఉంది. ఆయన తన భార్య గురించి పదేపదే ప్రస్తావించుకోవటం కరెక్టు కాదు. దాని వలన సానుభూతి పొందాలనుకోవటం చంద్రబాబు అవివేకం. వైయ‌స్‌ జగన్‌లో ఆత్మ విశ్వాసం కన్పిస్తుంటే.. చంద్రబాబులో నైరాశ్యం కనిపిస్తోందని’’ మంత్రి అంబటి అన్నారు.