దేశంలోనే డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేసే రాష్ట్రంగా తెలంగాణ

దేశంలోనే డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మారుమూల ప్రాంతాలకు మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును శనివారం మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు మెడిసిన్‌ ఫ్రమ్‌ స్కై తో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేయనుంది.

ఈ సందర్భాంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. డ్రోన్‌ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందన్నారు. గ్రహంబెల్‌ టెలిఫోన్‌, రైట్‌ బ్రదర్స్‌ విమానం లాగే డ్రోన్‌ టెక్నాలజీ ఓ సంచలనమని చెప్పారు. డ్రోన్లతో ఔషధాలు సరఫరా చేస్తున్న యువతను అభినందించారు. ఇలాంటి అభివృద్ధితో ప్రపంచానికి మనం మార్గదర్శకంగా ఉండబోతున్నామని.. మందులను డ్రోన్ లతో పంపిణీ చేయడం అంటే దేశానికే కాదు.. ప్రపంచానికి మనం ఆదర్శం అన్నారు. అందుకు తెలంగాణ వేదిక అయిందని..ప్రధాని మోడీ కల ఇది అన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నామని..ఎమర్జింగ్‌ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈరోజు చారిత్రాత్మక దినమని.. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్‌ ఆరా తీస్తారని, సామాన్యుడికి ఉపయోగంలేని సాంకేతికత వ్యర్థమని చెబుతారన్నారు.