కాంతారా చూస్తూ వ్యక్తి మృతి

కాంతారా ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కన్నడ లో విడుదలై…అక్కడ సూపర్ హిట్ తెచ్చుకొని , ఆ తర్వాత తెలుగు , హిందీ పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు ..వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాను చూడాలని సినీ లవర్స్ మాత్రమే కాదు రాజకీయ నేతలు సైతం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మరణించిన ఘటన కర్ణాటక మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది.

మాండ్య జిల్లా నాగమంగలలోని వెంకటేశ్వర థియేటర్లో కాంతారా సినిమా చూడటానికి రాజశేఖర్ (45) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఉదయం ఆటకి వెళ్ళాడు. సినిమా చూస్తూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాజశేఖర్ చివర్లో ఛాతిలో నొప్పి అంటూ అక్కడికక్కడే కూలిపోయాడు. స్నేహితులు, థియటర్ యాజమాన్యం వెంటనే స్పందించి హాస్పిటల్ కి తరలించినా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటుతోనే అతను మరణించినట్లు నిర్దారించారు. రాజశేఖర్ దేహాన్ని కుటుంబ సభ్యులకి, స్నేహితులు అప్పచెప్పారు. స్నేహితులతో సరదాగా సినిమాకి వెళ్లిన అతను అలా విగతజీవిగా రావడంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.