హైదరాబాద్ లో మద్యం అలర్జీ కేసు నిర్ధారణ

దేశంలోనే ఫస్ట్ టైం లిక్కర్ అలర్జీ కేసు నమోదు కావడం..అది కూడా హైదరాబాద్ లో వెలుగులోకి రావడం తో ఇప్పుడు వార్తల్లో హైలైట్ అవుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలోని 100 కుపైగా ఇలాంటి కేసులు నమోదు కాగా.. మొదటిసారి మన దేశంలో నమోదైంది. ఢిల్లీ దగ్గర ఆగ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన యువకుడికి ఆల్కహాల్ ఎలర్జీ అయినట్లు డాక్టర్స్ గుర్తించారు. కొన్ని వేల మందికి ఇలాంటి పరిస్థితి ఉండవచ్చని, నిర్ధారణ కాని పరిస్థితి ఉందని అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు.

ఆగ్రా ప్రాంతానికి చెందిన జాన్ (36) తన మిత్రులతో కలిసి పార్టీలో పాల్గొన్నాడని, కబుర్ల అనంతరం అందరూ కలిసి మద్యాన్ని సేవించారని డాక్టర్ తెలిపారు. అందరితో పాటు జాన్ మద్యం తాగాడని, సరిగ్గా 15 నిమిషాల తర్వాత ముఖమంతా ఎర్రబడి వేడిగా మారడం, చర్మంపై దురదలు రావడం, ఛాతీ బరువుగా అనిపించడంతో పాటు ఆయాసం వంటి లక్షణాలు కనిపించాయని బాధితుడు పేర్కొన్నాడు.

ఇది చాలా అరుదైన వ్యాధి అని, మద్యం సేవించడం వల్ల కొంతమంది శరీరంలో అలర్జీకి సంబంధించిన మార్పులు కన్పిస్తాయని వ్యాకరణం నాగేశ్వర్‌ తెలిపారు. ప్రపంచంలోనే ఈ తరహా కేసులు వందకు మించి ఉండవని చెప్పారు. చాలా దవాఖానలు తిరిగిన జాన్‌, చివరకు హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌ను సంప్రదించాడు. డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం అతడిని పరీక్షించి అరుదైన ఆల్కహాల్‌ అలర్జీగా తేల్చింది. మద్యం తాగేటప్పుడు నూనెలో వేయించిన మసాలా పల్లీలు, బఠానీలు, చికెన్‌, మటన్‌ రోస్ట్‌ వంటి హై హిస్టమిన్‌ ఫుడ్‌ తినడం వల్ల భయంకరమైన అలర్జీకి దారితీస్తుందని డాక్టర్‌ నాగేశ్వర్‌ వివరించారు.