కరోనా బారినపడిన సూపర్ స్టార్ మహేష్ బాబు

కరోనా మరోసారి తన ఉనికిని చాటుతుంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృభిస్తుంది. ఇక ఈసారికూడా చిత్రసీమలో చాలామంది కరోనా బారినపడుతున్నారు. ఈరోజు టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కరోనా బారినపడినట్లు తెలిపిందో లేదో..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కరోనా బారినపడ్డట్లు స్వయంగా తెలిపాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని.. స్వల్ప లక్షణాలతో హోమ్ ఇసో లేషన్ లో ఉన్నానని పేర్కొన్నారు.

గత కొద్దీ రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే తిరిగి షూటింగ్ కు వెళ్లాలని ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ విషయం తెలుపగానే అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లివచ్చారు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్ 01 న ప్రేక్షకుల ముందుకు తీసుకునే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నారు.

ఇదిలా ఉంటె తెలంగాణ లో గడచిన 24 గంటల్లో 54,534 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 1,913 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,214 మందికి పాజిటివ్ అని తేలింది. రంగారెడ్డి జిల్లాలో 213, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 161 కేసులు గుర్తించారు. అదే సమయంలో 232 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటిదాకా 4,036 మంది కరోనాతో మృతి చెందారు.

pic.twitter.com/PN7oR9GrUT— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022