తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు స‌మాన వాటా

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

supreme court
supreme court

న్యూఢిల్లీ:  ఆస్తి పంపకాల విషయంలో చాలా ఏళ్లుగా కూతుళ్లకు అన్యాయం జరుగుతూనే ఉంది. తండ్రి ఆస్తిని కుమారులకు మాత్రమే పంచుతున్నారు. కూతుళ్లకు వాటా ఇవ్వడం లేదు. ఆడపిల్లలకు సమాన వాటా ఇవ్వాలని హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 చెబుతున్నా ఇప్పటికీ చాలా మంది ఆడపిల్లలకు న్యాయం జరగడం లేదు. ఈ క్రమంలో మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకూ సమాన వాటా పంచాల్సిందేనని స్పష్టం చేసింది. చట్టం అమల్లోకి వచ్చే నాటికి (2005, సెప్టెంబర్ 9) తండ్రి బ్రతికి ఉన్నా, లేకపోయినా ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా దక్కుతుందని తేల్చిచెప్పింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

ఆడ పిల్లలకు ఆస్తి ఇచ్చే విషయంలో కొందరు తల్లిదండ్రులు పక్ష పాతం చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలే కాదు.. చాలా మంది ఇలాగే చేస్తున్నారు. కూతుళ్లకు పెళ్లిచేసి పంపించి.. తమ ఆస్తిని కుమారుల పేరిట రాస్తున్నారు. ఒకవేళ ఒక్కడే కొడుకు ఉంటే కొడుకుకి ఎక్కువ ఆస్తి ఇచ్చి, ఆడపిల్లలకు 10 నుంచి 30 శాతం వరకే ఇస్తున్నారు. ఆ క్రమంలో హిందూ వారసత్వ సవరణ చట్టం ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పించింది. ఐతే 2005లో చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి చనిపోతే సోదరులు తమ తోబుట్టువులకు ఆస్తిలో వాటా ఇవ్వడం లేదు. దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు… 2005నాటికి తండ్రి మరణించినా, బతికిఉన్నా ఆడపిల్లలకు సమాన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/