కేతవరం గ్రామానికి కృష్ణం రాజు సాయం ఎప్పటికి మరచిపోరు..

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామా ప్రజలు ఎప్పటికి కృష్ణం రాజు ను మరచిపోరు. ఎందుకో తెలుసా..అసలు ఈ కేతవరం అనే గ్రామం ఒకటి ఉన్నదని ఎవరికీ తెలియని సమయంలో ఆ గ్రామానికి కృష్ణం రాజు వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకొని , ఆ గ్రామానికి రోడ్డు వేశారు. ఇప్పటికి ఆ రోడ్డు చూస్తుంటే కృష్ణం రాజు గుర్తు వస్తారని అంటుంటారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కృష్ణంరాజు కేంద్ర మంత్రి హోదాలో 2003లో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామాన్ని సందర్శించారు. అప్పటికీ కేతవరం అనే గ్రామం ఒకటుందని చాలా మందికి తెలీదు. ఆ ఊరికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. కేతవరం గ్రామాన్ని సందర్శించిన తొలి కేంద్ర మంత్రి కృష్ణంరాజు కావడం విశేషం. తమ యోగ క్షేమాలు తెలుసుకునేందుకు వచ్చిన కృష్ణంరాజుకు కేతవరం గ్రామస్థులు తమ కష్టాలు చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. గ్రామానికి రోడ్డు వేయించాలని కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన కృష్ణంరాజు.. మీకు నేనున్నా.. రోడ్డు వేయించే బాధ్యత నాది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లారు. ఆయన కేతవరం వచ్చి వెళ్లిన పది రోజుల్లోనే రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కేతవరంలో ఆయన వేయించిన తారు రోడ్డు పదేళ్లకుపైగా చెక్కు చెదరకుండా ఉంది. దీంతో తారు రోడ్డును చూడగానే మాకు కృష్ణంరాజే గుర్తొస్తారని కేతవరం గ్రామస్థులు చెబుతున్నారు. కృష్ణంరాజు మరణంతో ఆ గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన చిరునవ్వు ఎప్పటికీ తమ గుండె చప్పుడుగా ఉంటుందని కేతవరం గ్రామస్థులు చెపుతున్నారు.