కృష్ణం రాజు మృతి ఫై సినీ , రాజకీయ ప్రముఖుల సంతాపం

రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఇకలేరు అనే విషయాన్నీ ఎవ్వరు తట్టుకోలేకపోతున్నారు. దాదాపు 200 చిత్రాలతో సినీప్రేక్షకులను అలరించిన ఆయన..చివరగా రాధేశ్యామ్ తో కనువిందు చేసారు. కేవలం సినీ నటుడిగానే కాక రాజకీయ నేతగా కూడా ప్రజల మెప్పుపొందారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన..ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. రేపు హైదరాబాద్ లో అంత్యక్రియలు జరగబోతున్నాయి.

ఇక కృష్ణం రాజు మృతి ఫై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపారు. ఆయన మరణం వెండితెరకు తీరని లోటని అభివర్ణించారు. కేంద్రమంత్రిగా దేశ ప్రజలకు సేవలందించారని గుర్తుచేసుకున్నారు. ఆయన తన అద్భుత నటనతో అశేష అభిమానం సంపాదించుకున్నారన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా కృష్ణం రాజు మృతికి సంతాపం ప్రకటించారు. ‘రెబల్ స్టార్’గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ ద్వారా సంతాప సందేశాన్ని షేర్ చేస్తూ కృష్ణంరాజుతో త‌న‌కున్న అనుబంధాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ‘‘శ్రీ కృష్ణంరాజుగారు ఇక లేరు అనే మాట ఎంతో విషాద‌క‌రం. మా ఊరి హీరో, చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నా తొలి రోజుల నుంచి పెద్ద‌న్న‌లా ఆప్యాయంగా ప్రోత్స‌హించిన కృష్ణంరాజుగారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయ‌మైంది. ఆయ‌న ‘రెబ‌ల్ స్టార్‌’కి నిజ‌మైన నిర్వ‌చ‌నం. కేంద్ర‌మంత్రిగానూ కూడా ఎన్నో సేవ‌ల‌ను అందించారు. ఆయ‌న లేని లోటు వ్య‌క్తిగ‌తంగా నాకు, సినీ ప‌రిశ్ర‌మ‌కు, ల‌క్ష‌లాది మంది అభిమానుల‌కు ఎప్ప‌టికీ తీర‌నిది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తూ, ఆయ‌న కుటుంబ స‌భ్యులంద‌రికీ నా త‌మ్ముడులాంటి ప్ర‌భాస్‌కి, సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను’’ అని అన్నారు చిరంజీవి.

టీడీపీ అధినేత చంద్రబాబు..”ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కృష్ణంరాజు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు, రాజకీయాల్లో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ..”ఉభయగోదావరి జిల్లాల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మృతి నన్ను కలచివేసింది. బీజేపీ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు” అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఆయన ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ సానుభూతిని తెలియజేశారు.

కృష్ణంరాజు మరణం సినిమా పరిశ్రమతో పాటు భారతీయ జనతా పార్టీకి తీరని లోటని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్‌ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రెబల్‌స్టార్‌ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అదేవిధంగా కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచంద్‌ కృష్ణం రాజు మరణంపై వ్యక్తం చేశారు. చిత్రసీమకు రెబల్‌స్టార్‌ మృతి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు.

అనుష్క స్పందిస్తూ.. మీరెప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు. కృష్ణంరాజుగారి ఆత్మకు శాంతి చేకూరాలి.. అంటూ తన ఇన్ స్టా గ్రామ్ లో ఆయనతో పటు దిగిన ఫోటోను షేర్ చేసింది.