కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఒకటే అంటూ పిక్ వైరల్

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్ జరగబోతుంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు సంబదించిన ఓ పిక్ ను సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వేరే కాదు ఇద్దరు ఒకటే అంటూ ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే గా గత ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్..ఈ మధ్యనే తన ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బిజెపి లో చేరారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది.

కాంగ్రెస్ నుండి స్రవంతి , టిఆర్ఎస్ నుండి ప్రభాకర్ , బిజెపి నుండి రాజగోపాల్ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల పోటీ ప్రధానంగా బిజెపి – టిఆర్ఎస్ ల మద్యే ఉండనుంది. కాంగ్రెస్ నుండి స్రవంతి బరిలో నిలిచినప్పటికీ ప్రజల నుండి పెద్దగా స్పందన కరువయింది. బిజెపి , టిఆర్ఎస్ పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఖర్చు చేయడం ప్రతి రోజు మద్యం, బిర్యానీ , డబ్బులు ఖర్చు చేయడంతో ఎక్కువగా కార్య కర్తలు ఆ వైపే ఉన్నారు. మరోపక్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ప్రచారం లో పాల్గొనకుండా ఫ్యామిలీ తో కలిసి ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లి..ఈరోజే హైదరాబాద్ కు వచ్చారు.

ఇదిలా ఉంటె గతంలో ఎప్పుడో వెంకట్ రెడ్డి – రాజగోపాల్ రెడ్డి లు దిగిన ఫోటోలను… ఉప ఎన్నికకు ముందు కొంతమంది వైరల్ చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఒకటేనని, సందేశం ఇచ్చేలా ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే దీనిని రాజగోపాల్ రెడ్డి బృందం ఖండించింది. కావాలనే తమపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.