కేసినోలు నిర్వహిస్తున్నా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

కొడాలి నానిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు?: ధూళిపాళ్ల

అమరావతి: రాష్ట్రంలో బహిరంగంగా కేసినోలను నిర్వహిస్తున్నా ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉన్నారంటూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. సీఎం మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేసినోను నిర్వహించిన మంత్రి కొడాలి నానిని జగన్ ఎందుకు బర్తరఫ్ చేయలేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీ కూడా మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… కేసినో నిర్వహించిన వీడియోను ఆయన బయటపెట్టారు.

ఈ సందర్భంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ.. జగన్ సహకారంతోనే కేసినో జరిగిందా? అని ప్రశ్నించారు. గుడివాడను జూద రాజధానిగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? అని అడిగారు. అసలు కేసినో జరగలేదని కొడాలి నాని అన్నారని… తాను బయటపెట్టిన వీడియో ఆధారాలకు ఆయన ఏం సమాధానం చెపుతారని అన్నారు. కేసినోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా… పోలీసులు ఇంతవరకు అటువైపు చూడలేదని విమర్శించారు. కేసినోకు జగన్ సహకారం ఉందనేది బహిరంగ నిజమని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/