గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

తెలంగాణ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాసిన వల్లంకితాళం అనే పుస్తకానికి గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను కవితా విభాగంలో ఆయన అవార్డు అందుకోబోతున్నారు. మొత్తం 20 భాషల్లో అవార్డులు ప్రకటించగా తెలుగు నుంచి గోరెటి వెంకన్నకి ఈ అవార్డు వచ్చింది. మరో కవి తగుళ్ల గోపాల్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దక్కింది. ‘దండకడియం’ రచనకు గాను ఈ అవార్డు వరించింది. కేంద్ర బాల సాహిత్య పురస్కారానికి దేవరాజు మహారాజు ఎంపికయ్యారు. ‘నేను అంటే ఎవరు’ అనే నాటక రచనకు ఈ పురస్కారం దక్కింది.

గోరటి వెంకన్న పాటకు పల్లె ప్రజలు, ప్రకృతి మూలాధారాలు.. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. ఇక, ఆయన సాహిత్యాన్ని, ఆయన పాటల్లోని మాధుర్యంతో పాటు.. ఎంతో విలువైన సూచనలను చూసి ముగ్ధుడైన సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌ కోటాలో శాసనమండలికి పంపారు. 2020, నవంబర్‌లో శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు వెంకన్న.. సీఎం కేసీఆర్‌ ఎన్నో సార్లు గోరటి వెంకన్న పాటలను సభావేదికలపై పాడిన సందర్భాలు ఉన్నాయి. 1963లో నాగర్‌కర్నూల్ జిల్లా, గౌరారం (తెల్కపల్లి)లో ఆయన జన్మించిన గోరటి వెంకన్న.. నాన్న పేరు నర్సింహ. అమ్మ ఈరమ్మ. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.. చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తి పాటలు పాడేవాడు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళ హారతులూ మొదలైన పాటలు పాడేది. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది.