సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

న్యూఢిల్లీ : నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేందుకు ఇవాళ లోక్‌స‌భ‌లో కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఆ స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. బిల్లుపై చర్చ నిర్వ‌హించ‌కుండానే సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు విప‌క్షాలు ఆరోపించాయి. దీంతో స‌భ‌లో ర‌భ‌స మొద‌లైంది. ఈ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లిన నిర‌స‌న చేప‌ట్టారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ.. ధాన్యం కొనుగోలుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై స్ప‌ష్టత ఇవ్వాల‌ని నినాదాలు చేశారు.

చ‌ర్చ లేకుండా మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు చేయ‌డంతో విప‌క్షాలు గంద‌ర‌గోళం సృష్టించాయి. మూజువాణి ఓటుతోనే బిల్లుకు ఓకే చెప్పేశారు. దీంతో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకువ‌చ్చారు. అయితే చ‌ర్చ‌ను చేప‌ట్టేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు చెప్పిన స్పీక‌ర్ బిర్లా.. ఆ గంద‌ర‌గోళం మ‌ధ్య స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వాయిదా వేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/