పంటల తెలంగాణ కావాలా..? మంటల తెలంగాణ కావాలా..? అంటూ ప్రశ్నించిన కేసీఆర్

పంటల తెలంగాణ కావాలా..? మంటల తెలంగాణ కావాలా..? అంటూ రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం కొంగరకలాన్‌ బహిరంగ సభలో మాట్లాడుతూ…నా కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వ‌ను. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు స‌ర్వ‌శ‌క్తుల‌ను ధార‌పోస్తాను. నా బ‌లగం ప్ర‌జ‌లే. మీ అండ‌దండ‌లు, ఆశీర్వ‌చ‌నం ఉన్నంత వ‌ర‌కు త‌న‌కేం కాద‌ని అన్నారు.

రంగారెడ్డి జిల్లా తెలంగాణ‌కే బంగారు కొండ‌గా మారింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఎక‌రం భూమి ఉన్న వ్య‌క్తి కూడా పెద్ద కోటీశ్వ‌రుడు. ఈ మ‌త పిచ్చిల ప‌డి దాన్ని చెడ‌గొట్టుకోవాలా. నీచ రాజ‌కీయాల కోసం రాష్ట్రాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తుంటే చూసి ఊరుకోవ‌ద్దు. ఓట్ల కోసం భార‌త సొసైటీని గోస పెట్టే ప‌రిస్థితి తెస్తున్నారు. మోడీ ఆగంఆగం అవుతున్నారు. ఉన్న ప‌ద‌వి చాలాదా? అంత‌క‌న్న పెద్ద ప‌ద‌వి లేదు క‌దా..? మ‌న తెలంగాణ‌లో ఎలాంటి కారుకూత‌లు కూస్తున్నారో ఆలోచించాలి. తెలంగాణ స‌మాజాం ప్ర‌శాంతంగా ఉంది. అద్భుత‌మైన‌టువంటి ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో అభివృద్ధి జ‌రుగుతుంది. ఈ దుర్మార్గులు, చిల్ల‌ర‌గాళ్లు, మ‌త పిచ్చిగాళ్ల మాయ‌లో ప‌డొద్ద‌ని కేసీఆర్ సూచించారు. పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా? అంటూ ప్రశ్నించారు.

‘మౌనంగా భరిద్ధామా? పిడికిలి బిగిద్దామా?. మౌనంగా భరిస్తే మతచిచ్చు పెట్టే మంటలు వస్తాయి. తమిళనాడు, బెంగాల్‌, ఢిల్లీలో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతాం. హైదరాబాద్‌ 24 గంటల కరెంట్‌ ఉంటే.. ఢిల్లీలో ఉండదు. ప్రధాని కంటే పెద్ద పదవి ఉందా?. ప్రధాని కుట్రలు చేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారు. నేను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వం’’ అంటూ కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.