తెలంగాణ కాప‌లాదారు టీఆర్ఎస్ పార్టీ – కేసీఆర్

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా హైదరాబాద్ HICC లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్లీనరీ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రానికి పెట్ట‌ని కోట‌. ఎవ‌రూ కూడా బ‌ద్ద‌లు కొట్ట‌లేని కంచుకోట టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి. ఈ పార్టీ యావ‌త్తు తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి. ఇది ఒక వ్య‌క్తిదో, శ‌క్తిదో కాదు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. అనుక్ష‌ణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను, ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే కాప‌లాదారు టీఆర్ఎస్ పార్టీ అన్నారు కేసీఆర్. తెలంగాణలో పాలన దేశానికే రోల్ మోడల్ అని… దేశంలో 10 ఉత్తమమైన గ్రామాల్లో అన్ని తెలంగాణ పల్లె లేనని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా అవినీతికి పాల్పడలేదని కేసీఆర్ అన్నారు.

తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల కన్నా తలసరి ఆదాయంలో తెలంగాణ ముందుంది అని… 2 లక్షల 78 వేలతో తలసరి ఆదాయంతో ముందు వరసలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రంగా, జీరో ఫ్లోరైడ్ రాష్ట్రంగా తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మనం పండించే పంటను కేంద్రం కొనలేని స్థితికి తెలంగాణ చేరిందని ఆయన అన్నారు. తెలంగాణ జీఎస్డీపీ దేశం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఒకప్పుడు 3 వైద్యకళాశాలలు ఉంటే ప్రస్తుతం 33 ప్రభుత్వ వైద్యశాలలను ఏర్పాటు చేసుకోబోతున్నాం అని ఆయన అన్నారు. సుమారు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలో టాప్ లో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ పని చేసిన స్థాయిలో దేశం పనిచేసినట్లయితే గొప్పస్థానంలో ఉండేదని.. టీఆర్ఎస్ పనిచేసిన స్థాయిలో కేంద్రంలోని బీజేపీ పనిచేసుంటే 14.5 లక్షల కోట్లు జీఎస్డీపీ ఉండే అవకాశం ఉండేదని ఆయన అన్నారు.

విద్యుత్ రంగంలో దేశ‌మంతా కారు చీక‌ట్లు క‌మ్ముకున్న వేళ‌లో వెలుగు జిలుగుల తెలంగాణ‌ను ఏర్పాటు చేసుకున్నామ‌ని కేసీఆర్ అన్నారు. ఇది మ‌న అంకిత భావానికి మంచి ఉదాహ‌ర‌ణ‌. ఏ రంగంలో అయినా అద్భుత‌మైన ఫ‌లితాలు సాధిస్తున్నాం. దేశానికే ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుస్తున్నాం. ఎంద‌రో మ‌హానుభావులు, గొప్ప‌వాళ్లు, పార్టీకి అంకిత‌మై ప‌ని చేసే నాయ‌కుల స‌మాహార‌మే ఈ ఫ‌లితాల‌కు కార‌ణం అని పేర్కొన్నారు.