తెలంగాణ దేశానికే రోల్ మోడ‌ల్‌గా నిలిచింది : సీఎం కెసిఆర్

హైదరాబాద్ : హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. ముందుగా టీఆర్ఎస్ ప్లీన‌రీ ప్రాంగ‌ణానికి చేరుకున్న టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంత‌రం తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు.

అనంతరం కేసీఆర్ ప్ర‌సంగించారు. టీఆర్ఎస్ పార్టీ 21 వ‌సంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని కేసీఆర్ తేల్చిచెప్పారు. నిబ‌ద్ధ‌మైన, సువ్య‌వ‌స్థీత‌మై కొలువుదీరిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు. 80 శాతం మంది ప‌రిపాల‌న భాగ‌స్వాములుగా ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌తో, 60 ల‌క్ష‌ల మంది స‌భ్యుల‌తో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు క‌లిగి ఉన్న సంస్థ‌గా అనుకున్న ల‌క్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధ‌న జ‌రిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్ష‌తంగా తీర్చిదిద్దుతున్న‌టువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్ట‌ని కోట‌. ఎవ‌రూ కూడా బ‌ద్ద‌లు కొట్ట‌లేని కంచుకోట అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి. ఈ పార్టీ యావ‌త్తు తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి. ఇది ఒక వ్య‌క్తిదో, శ‌క్తిదో కాదు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. అనుక్ష‌ణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను, ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే కాప‌లాదారు సీఎం పేర్కొన్నారు. రెండు ద‌శాబ్దాల క్రితం ఏడుపు వ‌స్తే కూడా ఎవ‌ర్నీ ప‌ట్టుకొని ఎడ్వాలో తెలువ‌ని ప‌రిస్థితి అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అస్థిత్వ‌మే ఆగ‌మ‌యైపోయే ప‌రిస్థితి. ఒక దిక్కుతోచ‌ని సంద‌ర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగిసిప‌డింది. అప‌జ‌యాలు, అవ‌మ‌నాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న త‌ర్వాత ప్ర‌జ‌ల దీవెనతో అద్భుత‌మైన పరిపాల‌న అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడ‌ల్‌గా తెలంగాణ నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/