మిర్చి రైతులకు తీపి కబురు తెలిపిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో మిర్చి పంట సాగు బాగా జరుగుంతుందనే సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది కూడా వందల క్వింటాలలో మిర్చి వేస్తారు. అయితే ప్రతి ఏడాది ధర బాగా ఉండదు. ఒక ఏడాది మిర్చి కి అధిక ధర ఉంటె..మరో ఏడాది కనీసం పెట్టుబడి కూడా రానంతలా ధర ఉంటుంది. దీంతో రైతులు నష్టపోతుంటారు. ఈ తరుణంలో రైతులకు అలాంటి దిగులు లేకుండా నేరుగా కంపెనీలతో రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేయించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, సూర్యపేట జిల్లాల్లో తేజ రకం మిర్చిని ప్లాంట్ లిపిడ్స్ సంస్థ కొననుంది. ఈ జిల్లాల్లో 20వేల టన్నుల మిర్చి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రైతులకు రవాణా భారం, దళారుల బెడద, తరుగు, కమిషన్ వంటివి తప్పనున్నాయి. ఈ వార్త తో మిర్చి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటె యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి ‘రైతుబంధు’ నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసిఆర్ ఆదేశించారు. రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం గాను రూ. 7,600 కోట్ల‌ను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.