చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన గంగవ్వ

తనకేమీ తెలీదని, వాళ్లు అనమంటేనే అన్నానని వ్యాఖ్య

My Village Show Gangavva Says Sorry to Nara Chandrababu

అమరావతిః టిడిపి అధినేత, ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘మై విలేజ్ షో’ ఫేమ్ గంగవ్వ క్షమాపణలు చెప్పారు. ఓ ఛానల్ వారు అనమన్నట్టే అన్నాను తప్ప తనకేమీ తేలియని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. గంగవ్వ క్షమాపణల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘అందరికీ నమస్కారం. నాకు వాళ్లు ఏదైనా చెబితేనే అంట.. కానీ నాకు అనరాదు. నేను పెద్దగా చదువుకోలేదు. ఆ సారును నేను అనను అంటే టీవీ ఛానల్ వాళ్లు అనిపించారు. కాబట్టి మీరు తప్పుగా అనుకోవద్దు. క్షమించండి. నాకు తెలువది ఎక్కువ. అనమంటేనే అన్నా. మీ అందరి వల్లే నాకు ఇంత గూడు అయ్యింది. నేను మాట జారితే క్షమించడయ్యా’’ అంటూ గంగవ్వ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఈ ఏడాది ఉగాది సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ టీవీ ఛానల్ వారు గంగవ్వ వద్దకు వెళ్లారు. కొందరు ప్రముఖుల ఫొటోలు గంగవ్వ ముందు పెట్టి జాతకాలు చెప్పమన్నారు. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు, లోకేశ్ ఫొటో కూడా చూపించారు. అయితే, చంద్రబాబు, లోకేశ్ పేర్లు చెప్పిన గంగవ్వ, వారి జాతకాలను చెప్పనని వెళ్లిపోయారు. కానీ ఛానల్ వారు మళ్లీ రెట్టించగా ‘చంద్రబాబుకు గ్రహణం పట్టింది’ అని గంగవ్వ వ్యాఖ్యానించారు. ఈ ఒక్క ముక్కను మాత్రమే కట్ చేసి వదలడంతో టిడిపి అధినేత ప్రత్యర్థులు దాన్నో అవకాశంగా తీసుకుని మరింతగా వైరల్ చేశారు. ఈ క్రమంలోనే గంగవ్వ చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.