కర్ణాటక ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు

దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటివిడతలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటె ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. వివిధ వార్తా సంస్థలు, మీడియా చానెల్స్ సర్వే ఏజెన్సీలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించగా మరి కొన్ని చానెల్స్ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ప్రకటించాయి. హంగ్ ఏర్పడితే జనతా దళ్ సెక్యులర్ కీలకం అవుతుందని కూడా కొన్ని సంస్థలు జోస్యం చెబుతున్నాయి. దీంతో భారీగా బెట్టింగులకు పాల్పడుతున్నారు.

తాజాగా, ఓ వ్యక్తి తన రెండెకరాల పొలాన్ని పందేం కాసి.. ఇందుకు ఎవరైనా ముందు రావాలని చాటింపు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హొన్నాళి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి శాంతనగౌడ గెలుస్తారని, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్యదే విజయమంటూ పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. శాంతనగౌడ గెలుపై నాగణ్ణ అనే వ్యక్తి తన రెండెకరాల పొలాన్ని పందేనికి ఉంచారు. ఎవరైనా పందెం కాసేవారు ఉంటే రావాలంటూ గ్రామంలో దండోరా వేయించడం వార్తల్లో హైలైట్ గా నిలుస్తుంది.