మునుగోడును అమెరికా చేస్తానని ప్రకటించిన కేఏ పాల్

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక పైనే దృష్టి సారించారు. ఇక్కడ జరగపోయే ఉప ఎన్నిక లో ఏ పార్టీ గెలుస్తుందో అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ , బిజెపి , టిఆర్ఎస్ పార్టీలే కాదు ప్రజాశాంతి పార్టీ సైతం బరిలో దిగబోతుంది. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మునుగోడు ప్రజలకు అదిరిపోయే హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మల్టీస్పెషాలిటీ ఆసుపత్రితోపాటు కార్పొరేట్ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నిన్న ఆదివారం కేఏ పాల్ 59వ పుట్టిన రోజు సందర్భంగా మునుగోడులో సభ నిర్వహించారు.

ఈ సందర్బంగా పాల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. ఉప ఎన్నిక కోసం పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించినా టీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదన్నారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తానని, నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ సైతం పాల్గొన్నారు.