రాజస్థాన్​ కాంగ్రెస్​లో సంక్షోభం..92 మంది ఎమ్మెల్యే లు రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి వరుస తలనొప్పులు తగ్గడం లేదు. ఓ రాష్ట్రం పీతలనొప్పి తగ్గిందనునుకునేలోపే మరో రాష్ట్రంలో వివాదాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధిష్టానానికి షాకిచ్చారు. తనకు మద్దతిస్తున్న 92 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. వీరంతా తమ రాజీనామా పత్రాలను స్పీకర్ సీపీ జోషికి అప్పగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కాలన్న దానిపై రాజస్థాన్ కాంగ్రెస్‌ రెండుగా విడిపోయింది. రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి పదవి రేసులో సచిన్ పైలట్ ముందున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతుండగా గెహ్లాట్ వర్గం మాత్రం అందుకు ససేమిరా అంటోంది.

నిన్న ఆదివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించారు. అయితే, అంతకంటే మందే గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. తాను కూడా రాజీనామా చేస్తానని పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో స్పందించిన అధిష్ఠానం సీఎల్పీ భేటీని రద్దు చేసింది. రాజస్థాన్‌లో సీఎం అశోక్‌ గహ్లోత్‌, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య ఎప్పట్నుంచో విభేదాలు కొనసాగుతున్న వేళ తాజా పరిణామాలతో మరోసారి అక్కడి రాజకీయాలు వేడెక్కాయి.

2020లో సచిన్‌ పైలట్‌ తన మద్దతుదారులైన 18మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసిన సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన 102 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు సీఎం కావాలని అశోక్‌ గహ్లోత్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు, ఏఐసీసీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో నామినేషన్‌ వేసే నాటికి గహ్లోత్‌ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆ పార్టీ తీసుకున్న ఒక్కరికి ఒకే పదవి విధానం ఆధారంగా ఆయన సీఎం పదవి నుంచి దిగిపోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.