చంద్రబాబు అరెస్టు పై కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌ సరైనదే.. కేఏ పాల్‌

KA Paul Sensational Comments On Chandrababu Arrest

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కచ్చితంగా అవినీతికి పాల్పడ్డారని, ఆయన అరెస్ట్‌ సరైనదే అని అన్నారు. ‘టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌ సరైనదే. ఆయన వందకు వందశాతం అవినీతికి పాల్పడ్డాడు. సీబీఎన్‌ని మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌తో పోల్చడం దారుణం. బాబు అరెస్ట్‌ అయినా ప్రజలతోపాటు టిడిపి కార్యకర్తల్లో ఎలాంటి స్పందనా లేదు. ఇక లోకేశ్‌ యువగళం పాదయాత్రలో అందరూ పెయిడ్‌ ఆర్టిస్టులే’ అని కేఏపాల్‌ విమర్శించారు. ఇక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, నైపుణ్యాభివృద్ధి పథకం కుంభకోణంలో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. మరోవైపు తనను జ్యుడీషియల్‌ కస్టడీ (జైలు)లో కాకుండా గృహ నిర్బంధం (హౌస్‌ రిమాండ్‌)లో ఉంచాలన్న ఆయన విజ్ఞప్తిని విజయవాడ ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. రాజమండ్రి జైలులో ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించామన్న సీఐడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో ఆయన తన కస్టడీని జైలులోనే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీమా కోరెగావ్‌ హింస కేసులో నిందితునిగా ఉన్న మానవ హక్కుల సంఘం కార్యకర్త గౌతమ్‌ నవలఖాకు సుప్రీంకోర్టు ‘హౌజ్‌ అరెస్ట్‌’కు వీలు కల్పించిందని, చంద్రబాబుకు కూడా అటువంటి అవకాశం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా కోరారు.