ధాన్యం కొనుగోలు చేసి నెల‌లు గ‌డుస్తున్నా డ‌బ్బులు ఇవ్వరా?

లాఖ‌రులోగా ప్ర‌తి గింజ‌కు డ‌బ్బులు ఇవ్వాలి.. లేదంటే రైతుల కోసం పోరాడ‌తాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

అమరావతి : రైతుల‌కు ధాన్యం సొమ్ములు చెల్లించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెల‌లు గ‌డుస్తున్నా డ‌బ్బులు ఇవ్వరా? అని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌శ్నించారు. ఈ నెలాఖ‌రులోగా ప్ర‌తి గింజ‌కు డ‌బ్బులు ఇవ్వాల‌ని, లేదంటే రైతుల కోసం పోరాడ‌తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ర‌బీ సీజ‌న్‌లో పండించిన ధాన్యాన్ని రైతుల నుంచి సేక‌రించి నెల‌లు గ‌డుస్తున్నా డ‌బ్బులు చెల్లించ‌కుండా ఆ క‌ష్ట జీవుల‌తో ప్ర‌భుత్వం క‌న్నీళ్లు పెట్టిస్తోంద‌ని చెప్పారు. మొత్తం రూ.3 వేల కోట్ల‌కు పైగా వ‌రి పండించిన రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌కాయి ప‌డింద‌ని వివ‌రించారు. ఎన్నిక‌ల‌కు ముందు హామీలు ఇచ్చి నిరుద్యోగుల‌ను ఎలా మోస‌పుచ్చారో అదే విధంగా రైత‌న్న‌ల‌ను కూడా న‌మ్మించి మోసం చేశార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శించారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతు ఖాతాకు డబ్బు జమ చేస్తామని చెప్పారన్నారు.

పాలనలోకి వచ్చిన తొలినాటి నుంచి నేటి వరకూ వైస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వడంలో విఫలమవుతూనే ఉందని జనసేనాని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొనుగోలు, బకాయిల విషయంలో ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తోందని ప్రశ్నించారు. తమ కష్టార్జితం కోసం అడిగిన రైతులను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు దూషించి, బెదిరించడం దుర్మార్గమని మండిపడ్డారు. నెలాఖరులోగా రైతుల బకాయిలు చెల్లించని పక్షంలో రైతులకు జనసేన పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని తెలిపారు. జొన్న, మొక్క జొన్న కొనుగోలు విషయంలోనూ రైతులను పార్టీలవారీ విడదీయడం దురదృష్టకరమన్నారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్నవారి నుంచే పంటను కొన్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను అందించడంలోనూ పార్టీ లెక్కలే చూస్తున్నారని అన్నారు. పండించే పంటకీ, తినే తిండికీ పార్టీ రంగులు పులమడం దిగజారుడుతనమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందుల వ్యాపారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని నిలదీశారు. విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు‌ వరకు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్నారు. జనసేన పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని… వారి కోసం పోరాడుతుందని పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/