ఇది దేశానికి దక్కిన గౌరవం – రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. కలెక్షన్ల పరంగానే కాదు అవార్డ్స్ పరంగా కూడా ఎన్నో అవార్డ్స్ దక్కించుకుంది. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ వేడుకల్లో కూడా సత్తా చాటింది. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఈ అవార్డ్స్ అందుకున్న చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ అవార్డులను డైరెక్టర్ రాజమౌళి, హీరో రామ్ చరణ్ కలిసి అందుకున్నారు.

ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ.. “ఇది కేవలం ఆర్ఆర్ఆర్‌కు దక్కిన గౌరవం మాత్రమే కాదు.. యావత్ భారత్‌కు దక్కిన గౌరవం. మా సినిమాను ఆదరించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రంలో స్టంట్స్ చేసేందుకు చాలా కష్టపడిన నా కొరియోగ్రాఫర్స్‌కు ముందుగా థాంక్స్. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం కష్టపడిన స్టంట్ మాస్టర్ జూజీకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో కేవలం ఒకటి రెండు సీన్లలో మాత్రమే డూప్స్ చేశారు. మిగతా అన్ని యాక్షన్ సన్నివేశాలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేశారు. వారి కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. ఇది కేవలం మాకు దక్కిన గుర్తింపు కాదు.. నా దేశానికి.. అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవం అని అన్నారు.

అలాగే ఈ వేడుకలో అవార్డు ప్రజెంటర్‭గా పాల్గొన్న చరణ్.. బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును ప్రకటించారు. హాలీవుడ్ నటి అంజలి భీమానీ తో కలిసి బెస్ట్ వాయిస్ మోషన్ క్యాప్చర్ అవార్డును రామ్ చరణ్ అందించారు. చరణ్ పక్కన నిల్చున్నందుకు ఆనందంగా ఉందని హాలీవుడ్ భామ అంజలీ అన్నారు. ఆయనతో కలిసి అవార్డును అందించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని , ఇదే తనకు అవార్డ్ విన్నింగ్ మూమెంట్ అని చెప్పుకొచ్చింది.