ప్రకాశం జిల్లాలో దారుణం : మహిళపై భూత వైద్యుడు అత్యాచారయత్నం..

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన మహిళా ఫై భూత వైద్యుడు అత్యాచారం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు కోసి చంపేశాడు. విషయం తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్థులు పోలీసులు సమక్షంలోనే అతడిని దారుణంగా కొట్టి చంపారు.

వివరాల్లోకి వెళ్తే

గ్రామంలోనే భూత, నాటువైద్యుడిగా గుర్తింపు పొందిన తన్నీరు ఓబిశెట్టి(60) ఉరఫ్‌ ఓబయ్య వద్ద కొంతకాలంగా ఓ మహిళా చికిత్స చేయించుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మందులు ఇస్తానంటూ ఓబిశెట్టి ఇంటికి పిలిచాడు. వైద్యుడి మాటలు నమ్మిన ఆమె అతని ఇంటికి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఓబిశెట్టి.. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించడంతో.. ఓబిశెట్టి ఆమె గొంతుకోసి చంపేశాడు. ఆ సమయంలో మహిళ పెద్దగా కేకలు వేసినా.. ఓబిశెట్టి భూతవైద్యం చేస్తున్నాడనుకొని చుట్టుపక్కల వారు పట్టించుకోలేదు. సాయంత్రం ఆరు, ఆరున్నర సమయంలో మహిళను చంపేసిన ఓబయ్య, రాత్రి 8 గంటల వరకు మృతదేహంతో ఇంట్లోనే ఉండి ఆ తర్వాత బయటకు వచ్చాడు. కంగారుగా ఇంటిచుట్టూ తిరుగుతుండటంతో గమనించిన ఓ బాలిక.. తన సోదరుడి సహాయంతో జరుగుమల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న స్థానికులు, బాధిత మహిళ కుటుంబ సభ్యులు, భర్త, కుమారులు పోలీసుల అదుపులో ఉన్న ఓబయ్యపై దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులు ఒక్కసారిగా దాడిచేయడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. దీంతో అదనపు బలగాల కోసం ఫోన్ చేశారు. అయితే, అవి వచ్చేలోపే ఓబయ్యను గ్రామస్థులు కర్రలతో కొట్టి చంపేశారు.