గాజా నగరాన్ని సంపూర్ణంగా చుట్టుముట్టాం: ఇజ్రాయెల్ సైన్యం వెల్లడి

గ్రౌండ్ లెవల్ ఆపరేషన్లను మరింత ఉధృతం చేసిన ఇజ్రాయెల్

Israel Army Says Gaza City Encircled

జెరూసలెం: తమ దేశంలో అక్టోబర్ 7న నరమేధం సృష్టించిన హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా గ్రౌండ్ లెవల్ ఆపరేషన్లను ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. పాలస్తీనాలో ఉగ్రమూకలు దాక్కున్న గాజా నగరాన్ని సంపూర్ణంగా చుట్టుముట్టినట్టు గురువారం ప్రకటించింది. ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న గాజా నగరం చుట్టూ సైనికులు మోహరించారని వెల్లడించింది. ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డేనియల్ హగారీ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

కాగా, వారం రోజులుగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్ దళాలు భీకర భూయుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుపుతున్నాయి. దాడులు ఆపాలంటూ విజ్ఞప్తులను ఆ దేశం పట్టించుకోవడం లేదు. కాల్పుల విరమణ గురించి ప్రస్తుతం తాము ఆలోచించడం లేదని డేనియల్ హగారీ స్పష్టం చేశారు.