రాజ్యసభలో తృణమూల్‌ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్​ సస్పెన్షన్‌

Trinamool’s Derek O’Brien Suspended From Rajya Sabha For Rest Of Session

న్యూఢిల్లీః రాజ్యసభలో మరో ఎంపీపై వేటు పడింది. అనుచిత ప్రవర్తన కారణంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డెరెక్‌ ఓబ్రియెన్‌ను ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సస్పెండ్ చేశారు. ఈ సీజన్‌ పార్లమెంట్ సమావేశాల మొత్తానికి ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు ధన్‌ఖడ్‌ ప్రకటించారు. కాగా.. ఇప్పటికే రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్ కుమార్‌ సింగ్‌పై కూడా వేటు పడిన విషయం తెలిసిందే.

దిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా ఓబ్రియెన్‌ తీరుపై ఛైర్మన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పబ్లిసిటీ కోసం ఆయన సభలో నాటకీయంగా వ్యవహరిస్తున్నారని ధన్‌ఖడ్‌ మండిపడ్డారు. ఓబ్రియెన్‌ ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే ఓబ్రియెన్‌ను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని రాజ్యసభా పక్ష నేత పీయూష్‌ గోయల్‌ మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై నేడు ఓటింగ్‌ జరిపిన ఛైర్మన్‌.. ఓబ్రియెన్‌ను ఈ సీజన్‌ సమావేశాల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.