మరో ప్రపంచ సంగ్రామానికి వేదిక ఇండో-పసిఫిక్‌

చైనా విస్తరణ వాంఛకు వ్యతిరేకంగా పోరాటం అవసరం

Indo-Pacific Region
Indo-Pacific Region

ఒక ప్రాంతం భౌగోళిక, ఆర్థిక, రాజకీయ రీత్యా ఆ ప్రాంతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడుతుంది.

గతంలో అట్లాంటిక్‌ మహాసముద్ర ప్రాంతం భౌగోళిక, ఆర్థిక, రాజకీయ రీత్యా ఆ ప్రాంతానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ ప్రాంతంపై ఆధిపత్యానికై రెండు రాజకీయ సైద్ధాంతిక వైరుధ్య భావా లున్న దేశాల మధ్య జరిగిన పోటీ ఫలితమే రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్నయుద్ధం.

ప్రస్తుతం ఇండో-పసిఫిక్‌ దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు మరో ప్రపంచ సంగ్రామానికి వేదిక కానుందా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

అంతర్జాతీయ వాణిజ్య రీత్యా ఇండో-పసిఫిక్‌ ప్రాంతం చాలా ముఖ్యమైనది.

ఈ ప్రాంతం కనీసం ముప్ఫై ఎనిమిది దేశాలను కలిగి ఉంది. ఇది ప్రపంచ ఉపరితల వైశాల్యంలో 44 శాతాన్ని, ప్రపంచ జనాభాలో 65శాతాన్ని ప్రపంచ జిడిపిలో 62 శాతాన్ని, ప్రపంచ వాణిజ్యం లో 46 శాతాన్ని వాటాగా కలిగి ఉంది.

గత కొన్నిదశాబ్దాలుగా చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో మరో ధ్రువంగా తనను తాను రూపాంతరించుకుంటుంది. చైనా విస్తరణ వాంఛతో టిబెట్‌, హాంకాంగ్‌, తైవాన్‌లపై ఆధిపత్యం చెలాయి స్తూనే ఉంది.

దక్షిణచైనా సముద్ర దేశాలైన వియత్నం, మలే షియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌,బ్రూనే మొదలైన దేశాలతో చైనా దక్షిణ చైనా సముద్ర విషయంలో సంఘర్షణకు దిగుతూనే ఉంది.

స్పాట్లీ, పారసెల్‌ దీవ్ఞల్లో ద్వీప భవనాలను నిర్మిస్తుంది.

జపాన్‌, చైనా మధ్య సెంకాకు లేదా డియోయు దీవుల కోసం వివాదం నడుస్తుంది. దక్షిణాసియాలో సమతుల్యతలు దెబ్బతీసే విధంగా భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక, మాల్దీవుల్లో చైనా సముద్ర ప్రాజెక్టులు చేపడుతుంది.

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా పాకిస్థాన్‌తో కలిసి వివిధ ప్రాజెక్టులు చేపట్టే ప్రయత్నం చేస్తుంది.

లడఖ్‌ నుంచి టిబెట్‌ మీదుగా హాంకాంగ్‌, తైవాన్‌ వరకు శ్రీలంక నుంచి ఫిలిప్పీన్స్‌ వరకు జపాన్‌ నుంచి ఆస్ట్రేలియా వరకు ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంది.

మరోవైపు ఈ ప్రాంతంలో అమెరికా గత కొంత కాలంగా తన దృష్టిని సారిస్తూ ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకొని తన వ్యూహాన్ని ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై అమలు చేయడం ప్రారంభించింది.

అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇండియాను కలుపుకొని క్వాడ్‌ పేరిట అవతరించి, భౌగోళిక ఆర్థిక సహకారం నుంచి ప్రస్తుతం సైనిక సహకారం వరకు ఒప్పందాలను విస్తరిస్తుంది.

అట్లాంటిక్‌ మహా సముద్రంలో యుయెస్‌యెస్‌ఆర్‌ (రష్యా) ప్రభావాన్ని నివారించుటకు ఆనాడు అమెరికా నాటోని ఏ విధంగా ఏర్పరచిందో ప్రస్తుతం చైనా ప్రభావాన్ని నివారించుటకు ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో క్వాడ్‌ పేరుతో సైనిక రక్షణ వ్యవస్థను ఏర్పరుస్తుంది.

క్వాడ్‌ ప్లేస్‌ పేరుతో ఇండో-పసిఫిక్‌ ప్రాంత దేశాలకు దగ్గరవుతుంది. యుయెస్‌యెస్‌ఆర్‌ విచ్ఛిన్నం తరువాత చైనా విస్తరణ వాంఛ వల్ల భారత్‌ వంటి దేశాలు అమెరికా కౌగిలిలోకి వెళ్లిపోతున్నాయి.

2002లో జియెస్‌యంఐఎతో ప్రారంభమైన అమెరికా, భారత్‌ ఒప్పందాలు 2016లో లెమోవా, 2018లో కామ్‌కాసా,2020లో బెకాతో పూర్తిగా అమెరికా, భారత్‌ సైన్యాలు అనుసంధానం చేయబడుతున్నాయి.

భవిష్యత్తులో అమెరికా సైన్యాలు యధేచ్ఛగా భారత భూభాగాలను ఉపయోగించుకోవచ్చు. భారతదేశమే కాదు బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవ్ఞలతో సైతం అమెరికా సైనిక ఒప్పందాలకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది.

దక్షిణాసియాని తన సైనిక కౌగిల్లోకి లాక్కునే ప్రయత్నం చేస్తోంది. పాకిస్థాన్‌ ఇప్పటికే అమెరికా మిత్ర దేశం. భారత్‌-పాకిస్థాన్‌ బద్ధశత్రువ్ఞలు అయినా అమెరికాకు సైనిక మిత్ర దేశాలుగా మారుతున్నాయి.

భవిష్యత్తులో చైనా ఉత్తర కొరియా, ఇరాన్‌, ఆప్ఘనిస్థాన్‌తోపాటు ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలోని తనతో కలిసి వచ్చే దేశాలతో ఒక సైనిక ఒప్పందాన్ని ఏర్పర్చుకున్న ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

అమెరికా చైనాలమధ్య వాణిజ్య యుద్ధంగా ప్రారంభమైన సంఘర్షణ కరోనాతో ఉపందుకుంది.

చైనాలోని వూహన్‌ నగరం లోనే కరోనా వైరస్‌ పుట్టిందని స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఆరోపించడంతో ఈ రెండు దేశాల మధ్య సంఘర్షణ ఇంకా పెరిగింది.

చైనా కమ్యూనిస్టు పార్టీ కరోనా విషయాన్ని దాచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనానికి, లక్షలాది ప్రజల మరణానికి కారణం అయిందని అమెరికా మంత్రులు ఆరోపిస్తున్నారు.

గతంలో వలె న్యూడీల్‌, మార్షల్‌ ప్రణాళికలతో కరోనాతో అతలాకుతలం అయిన ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను చక్కపరిచేందుకు అమెరికా ఏదో ఒక పేరుతో ముందుకు రావచ్చు.

తన ఆర్థికబలంతో కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థికకష్టాలు తర్చే నెపంతో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై పట్టుబిగించే మరో ప్రయత్నం చేయ వచ్చు.

అదే వరుసలో చైనా కూడా తన మిత్రదేశాలకు కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక కష్టాలు తీర్చుటకు అమెరికాకు వ్యతిరేకంగా ఒక ప్రణాళికతో ముందుకు రావచ్చు. ఈ పరిణామాలన్ని ఇండో- పసిఫిక్‌ ప్రాంతాన్ని మరో సంగ్రామానికి వేదికగా మార్చనున్నాయి.

చైనా ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని సవాలుఎ చేస్తుందనే ఉద్దేశంతో అమెరికా ఇండో-పసిఫిక్‌ ప్రాంత దేశాల బలహీనతలను ఆసరాగా చేసుకొని వాటితో సైనిక ఒప్పందాల ద్వారా ఈ ప్రాం తాన్ని తన స్వప్రయోజనాల కోసం వాడుకోబోతుంది.

ఆనాడు యుఎస్‌ ఎస్‌ఆర్‌(రష్యా)ని నివారించడానికై తన స్వప్రయోజనాల కోసం అట్లాంటిక్‌ మహాసముద్ర ప్రాంతాన్ని ఎలాగైతే వాడుకుందో,…

ప్రస్తుతం చైనా ఆధిపత్యాన్ని తగ్గించుటకు ఇండో-పసిఫిక్‌ ప్రాం తాన్ని ఉపయోగించుకొనుటకు అమెరికా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇప్పటికైనా ఇండో-పసిఫిక్‌ ప్రాంత దేశాలు అమెరికా కుటిలనీతిని పసిగట్టి దాని ధృతరాష్ట్ర కౌగిళ్ల నుంచి బయటికివచ్చి సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తున్న దేశాలతో జట్టు కట్టి చైనా విస్తరణ వాంఛకు వ్యతిరేకంగా పోరాడాలి.

-జుర్రు నారాయణ యాదవ్‌
(రచయిత: టిటియు జిల్లా అధ్యక్షులు)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/