భార‌త్ వ్యాక్సిన్ల‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని చాటింది

భారత్‌లో క‌రోనా వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిపై డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ప్ర‌శంస‌

న్యూఢిల్లీ: భారత్‌లో క‌రోనా వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ప్ర‌పంచ‌ అవసరాలకు త‌గ్గ వ్యాక్సిన్ల‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని, కొత్త‌ ఆవిష్కరణల సత్తాను భార‌త్ చాటింద‌ని చెప్పారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా కేసుల విజృంభ‌ణ ఒక్క‌సారిగా పెరిగింద‌ని, దానిపై పోరాటం ప్రస్తుతం చాలా కీలక దశకు చేరుకుందని తెలిపారు. ఐరోపా, అమెరికాలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. క‌రోనా వైరస్‌ రకాలపై అనిశ్చితి నెలకొందని, అయితే, వ్యాక్సిన్ల సామర్థ్యంపై అధ్యయనానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు.

భార‌త్ అనేక దేశాలకు క‌రోనా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. కాగా, ఈ ఏడాది డిసెంబ‌రులోగా కరోనా అంతమవుతుందన్న అంచ‌నాలు స‌రికాద‌ని డబ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ విభాగం డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్ చెప్పారు. అయితే, వ్యాక్సిన‌ల్ఉ వచ్చిన నేపథ్యంలో క‌రోనా వ‌ల్ల‌ ఆసుపత్రిపాల‌య్యే వారి సంఖ్య‌తో పాటు మ‌ర‌ణాలు త‌గ్గొచ్చ‌ని తెలిపారు. క‌రోనా వ్యాప్తిని వీలైనంత కట్టడి చేయడమే ప్రపంచం ముందు నేడున్న అతిపెద్ద సవాల్‌ అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/