ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు.. రేప‌టి నుంచి చార్జీల అమ‌లు

ఆర్డిన‌రీల్లో టికెట్‌పై రూ.2 పెంపు
ఎక్స్‌ప్రెస్‌ల్లో రూ.5, ఏసీ బ‌స్సుల్లో రూ.10పెంపు

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను పెంచుతూ బుధ‌వారం నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పెరిగిన డీజిల్ చార్జీల కార‌ణంగా ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను పెంచ‌క త‌ప్ప‌డం లేద‌న్న ద్వార‌కా.. కేవ‌లం డీజిస్ సెస్‌ను మాత్ర‌మే పెంచుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. డీజిల్ సెస్ కింద ప‌ల్లె వెలుగు, ఆర్డిన‌రీ స‌ర్వీసుల్లో రూ.2 మేర చార్జీలు పెంచుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అదే స‌మ‌యంలో ఎక్స్‌ప్రెస్‌,డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల్లో ఈ సెస్‌ను రూ.5గా పెంచుతున్నామ‌ని చెప్పారు. ఇక ఏసీ బ‌స్సుల్లో చార్జీల‌ను రూ.10 పెంచుతున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. పెరిగిన టికెట్ ధ‌ర‌లు రేప‌టి నుంచే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు. ప‌ల్లె వెలుగు బ‌స్సుల్లో క‌నీస టికెట్ ధ‌ర‌ను రూ.10కి పెంచుతున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఈ సందర్భంగా ఆయ‌న ఓ కీల‌క వ్యాఖ్య చేశారు. ప్ర‌స్తుతం పెంచుతున్న‌ది బ‌స్సు చార్జీల‌ను కాద‌ని చెప్పిన ఆయ‌న కేవ‌లం తాము టికెట్‌పై సెస్ మాత్ర‌మే విధిస్తున్నామ‌ని చెప్పారు. ఇక పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల కార‌ణంగా ఆర్టీసీపై ప‌డే న‌ష్టాల‌ను త‌గ్గించుకునేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని, ఇందులో భాగంగా ఆర్టీసీ స్థ‌లాల‌ను లీజుకు ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/