కర్ణాటకలో చెట్టుపై నోట్ల కట్టలు..స్వాధీనం చేసుకున్న అధికారులు

కర్ణాటకలో ఇప్పటిదాకా రూ.300 కోట్లకు డబ్బును జప్తు చేసిన ఈసీ

income-tax-department-seized-rupees-one-crore-house-brother-congress-candidate-ashok-kumar-rai

బెంగళూరుః మరో వారం రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇదే సమయంలో కోట్ల కొద్దీ డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇప్పటిదాకా రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును ఈసీ సీజ్ చేసింది. ఇందులో ఒక్క బెంగళూరులోనే రూ.82 కోట్లను స్వాధీనం చేసుకుంది.

తాజా మైసూరులో ఓ వ్యక్తి ఇంట్లోని పెరట్లో చెట్టుపై దాచిన కోటి రూపాయలను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. చెట్టుపై బాక్సులు ఉండటం గమనించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు. అంతకుముందు ఏప్రిల్ 13న బెంగళూరు సిటీ మార్కెట్ ఏరియాలో రూ.కోటిని పోలీసులు జప్తు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో డబ్బు తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.