మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌ తెలిపిన జగన్ సర్కార్

జగన్ సర్కార్ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు తీపి కబురు అందించింది. రాష్ట్ర ఆబ్కారీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ శుక్రవారం మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. మొదటి విడత లో 11 మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ లావాదేవీలు ఉంటాయని రజత్ భార్గవ వెల్లడించారు. అనంతరం, 3 నెలల్లో అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రవేశపెడతామని తెలిపారు.

మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపుల కోసం ఎస్బీఐ సహకారం తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలకు అదనపు చార్జీలు ఉండవని రజత్ భార్గవ స్పష్టం చేశారు. క్రెడిట్ కార్డు లావాదేవీలకు మాత్రం నిబంధనల ప్రకారం చార్జీలు ఉంటాయని తెలిపారు. మద్యం షాపుల్లో కేవలం నగదు మాత్రమే అనుమతించడం వల్ల ఎదురవుతున్న అసౌకర్యం దృష్టిలో ఉంచుకుని డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. విజయవాడలో 20 షాపుల్లో ఈ విధానాన్ని అమలులోకి తెస్తున్నామని ముందుగా 11 షాపుల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ విధానం వల్ల నగదు, డిజిటల్ చెల్లింపుల ద్వారా ఎంతమద్యం అమ్మకం జరిగింది, ఏ ఏ కంపెనీ బాటిల్స్ ఎన్ని అమ్మారని కూడా తెలుస్తుంది అన్నారు. ఫిబ్రవరి 5 నుండి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సేవలను ప్రారంభించటంతో పాటుగా, రానున్న రెండు మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3780 మద్యం షాపుల్లో కూడా డిజిటల్ చెల్లింపులు ప్రారంభమవుతాయని ఆయన తెలియజేశారు. వివిధ మద్యం బ్రాండ్లపై పన్నుల శాతంలో వ్యత్యాసం ఉన్నందున నగదు సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.