ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఇకలేరు

ఫుట్‌బాల్‌ దిగ్గజం బ్రెజిల్‌ ఆటగాడు పీలే (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన భారత కాలమానం ప్రకారం … గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సావోపాలోలోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. క్యాన్సర్‌ బారిన పడ్డ పీలేకు గతేడాది సెప్టెంబర్‌లో వైద్యులు పెద్ద పేగులో క్యాన్సర్‌ కణితిని తొలగించారు. అప్పటి నుంచి ఆయనకు కీమోథెరపీ చికిత్స అందించారు.

పీలే కన్నుమూయడంతో దేశాధినేతలు, క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇటీవలి క్రిస్మస్‌ రోజున ఆస్పత్రిలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా గడిపిన పీలే ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. 1940 అక్లోబరు 23న జన్మించిన పీలే అసలు పేరు ఎడ్సన్‌ అరెంటస్‌ డొ నసిమెంటో. అతడి తండ్రి డాండినో కూడా ఫుట్‌బాలర్‌ కావడంతో పీలే జీన్స్‌లోనే ఈ ఆట ఉంది. బౌరు పట్టణంలో పెరిగిన పీలే పేదరికాన్ని అధిగమించేందుకు చిన్నతనంలో చాయ్‌ దుకాణంలో సర్వర్‌గా పనిచేశాడు. తండ్రి తొలి కోచ్‌గా అనంతరం వాల్డెమార్‌ డి బ్రిటో శిక్షణలో రాటుదేలిన పీలే ప్రొఫెషనల్‌ కెరీర్‌ 1956లో శాంటోస్‌ క్లబ్‌తో ప్రారంభమైంది. క్లబ్‌ ప్లేయర్‌గా అమోఘమైన ఆట తీరుతో ఆకట్టుకొని అనతికాలంలోనే బ్రెజిల్‌ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఫుట్‌బాల్‌లో మూడు ప్రపంచకప్‌ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడు పీలేనే. ఆయన బ్రెజిల్‌కు మూడు సార్లు ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లు అందించారు. కెరీర్‌లో 1,281 గోల్స్‌ చేశారు. మంత్రముగ్ధమైన తన ఆటతో రెండు దశాబ్దాలపాటు సాకర్‌ ప్రేమికులను ఉర్రూతలూగించిన పీలే.. తన తరంలోనే కాకుండా మొత్తంగా ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచారు.