వరుస ప్రమాదాల కారణంగా అర్ధాంతరంగా నిలిపేసిన కార్​ రేసింగ్​ లీగ్​

హైదరాబాద్ లో శనివారం అట్టహాసంగా ప్రారంభమైన కార్​ రేసింగ్​ లీగ్​..ఆదివారం అర్ధాంతరంగా నిలిపేశారు. ఆదివారం రేసర్లకు వరుస ప్రమాదాలు జరగడంతో రేసింగ్ ను నిలిపేశారు. క్వాలిఫయింగ్​ రేసులో కొత్త ట్రాక్​ పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి. ఈనేపథ్యంలో లీగ్​ నిర్వహణను ఆపేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వరుస ప్రమాదాలపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

కొత్త ట్రాక్ పై అలవాటు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ట్రాక్ సరిగ్గా లేకపోవడంతో ఫార్ములా-3 రేస్ రద్దు చేసి.. ఫార్ములా-4 రేస్ తో సరిపెట్టారు. ఈ అనూహ్య నిర్ణయంతో ఆదివారం వేళ ఇంటర్నేషనల్ ఈవెంట్ చూద్దామని వచ్చిన ఎంతోమంది అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.

ఇక ఇండియన్ రేసింగ్ లీగ్ ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్ నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకెళ్లాయి. భారత్‌లో నిర్వహిస్తున్న తొలి స్ట్రీట్ సర్క్యూట్ కాగా.. ఇందులో హైదరాబాద్‌లో జరుగుతుండడం విశేషం. రేస్‌‌లో మొత్తం 24 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు పాల్గొనగా.. హెచ్‌ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.