అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య కోసం క్షుద్రపూజలు చేసిన భర్త

అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య కోసం క్షుద్రపూజలు చేసిన భర్త

ప్రస్తుతం టెక్నాలజీ రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ..కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాలను గట్టిగా నమ్ముతున్నారు. తాజాగా కొత్తగూడెం లో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య…ఎంతకు తన దగ్గరికి రావడం తో సదరు భర్త క్షుద్రపూజలు చేసి ఆమె మనసు మార్చాలని ట్రై చేసిన ఘటన బయటకు వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

కొత్తగూడెం పట్టణంలోని శేఖరంబంజరకు చెందిన కారు డ్రైవర్‌కు జూలూరుపాడు మండలం కొమ్ముగూడేనికి చెందిన యువతితో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నాలుగేళ్లు అవుతున్న వీరికి సంతానం కలగకపోవడంతో దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. ఐదు నెలల క్రితం సదరు వ్యక్తి వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత అక్కడి నుంచి మణుగూరులో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది.

ఇటీవల ఇంటికి తిరిగివచ్చిన వ్యక్తి.. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అయితే, ఆమె మనసు మారి తిరిగి కాపురానికి రావాలంటే క్షుద్రపూజలు ఒక్కటే మార్గమని స్నేహితులు చెప్పారు. వారి మాటలు నమ్మిన యువకుడు రెండు నెలల క్రితం ఓ మాంత్రికుడిని సంప్రదించాడు. రూ. 30 వేలు ఇచ్చి పూజలు చేయించాడు. ఆ తర్వాత నాలుగు రోజులకే భార్య నుంచి ఫోన్ రావడంతో సంతోషంతో మణుగూరు వెళ్లాడు.

మరోవైపు అప్పటికే అతడి క్షుద్రపూజల వ్యవహారం వెలుగుచూడడంతో యువతి బంధువులు అతడిని పట్టుకుని చావబాది పోలీసులకు అప్పగించారు. భార్యాభర్తలిద్దరినీ పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించి వేశారు. అప్పటి నుంచి వారిద్దరూ విడిగా జీవిస్తున్నారు.