భారీ వర్షాలు..ముంబయికి రెడ్ అలర్ట్ జారీః ఐఎండీ

Heavy Rain In Mumbai, Red Alert Announced

ముంబయిః భారీ వర్షాలు మహారాష్ట్ర ముంబయిని ముంచెత్తుతున్నాయి. గత 24 గంటల్లో ముంబయి నగరం సహా శివారు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈరోజు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబయి కేంద్రంగా పనిచేసే భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు మహానగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో మహా అధికారులు అప్రమత్తమయ్యారు. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.

కాగా, గత 24 గంటల్లో ముంబయిలో 223.2 మిల్లీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో 153.5 మి.మీటర్లు, రామమందిర్ ప్రాంతంలో 161 మి.మీటర్లు, బైకుల్లాలో 119 మి. మీటర్లు, సియోన్ ప్రాంతంలో 112 మి.మీటర్లు, బాంద్రాలో 106 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో ముంబయి నగరం సహా శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వచే అవకాశం ఉందని అంచనా వేసింది.