మణిపూర్‌ అంశం..న‌ల్ల దుస్తుల్లో విపక్ష ఎంపీల నిర‌స‌న‌.. లోక్‌స‌భ వాయిదా

opposition-mps-wear-black-clothes-stage-protest-outside-parliament-over-manipur-issue

న్యూఢిల్లీ: గ‌త అయిదు రోజుల నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు మ‌ణిపూర్ అంశం పై ద‌ద్ద‌రిల్లుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాని మోడీ ఆ అంశంపై ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌క‌ట‌న చేయాల‌ని విప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్నాయి. ఈరోజు కూడా లోక్‌స‌భ‌లో విప‌క్ష ఎంపీలు నినాదాలు చేశారు. ప్ర‌శ్నోత్త‌రాల‌ను అడ్డుకున్నారు. దీంతో లోక్‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. ప్ర‌ధాని మోడీ స‌మ‌క్షంలో మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న హింసాకాండ‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈరోజు ఉద‌యం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కొంద‌రు ఎంపీలు న‌ల్ల దుస్తులు ధ‌రించి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. రాజ్య‌స‌భ‌కు చెందిన విప‌క్ష ఎంపీలు ఆ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. ప్ర‌ధాని మోడీ స‌భ‌కు వ‌చ్చి మ‌ణిపూర్‌పై ప్ర‌క‌ట‌న చేయాల‌ని ఆ ఎంపీలు నినాదాలు చేశారు. న‌ల్ల దుస్తులు ధ‌రించిన విప‌క్ష ఎంపీల‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ విమ‌ర్శ‌లు చేశారు. ఆ దుస్తులు ధ‌రించిన వాళ్ల ప్ర‌స్తుత ప‌రిస్థితి, గ‌తం, భ‌విష్య‌త్తు కూడా న‌లుపే అని ఆయ‌న రాజ్య‌స‌భ‌లో ఆరోపించారు. కానీ వాళ్ల జీవితాల్లో వెలుగు వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.