ఐలమ్మ విగ్రహానికి పూలమాల నివాళ్లు అర్పించిన మంత్రి హరీష్ రావు

ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్​ బోర్డు సర్కిల్​ వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి హరీష్ రావు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక చాకలి ఐలమ్మ అని, చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో స్వరాష్ట్ర కల సాకారం చేసుకున్నామని హరీష్ రావు అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణం అన్నారు. రానున్న రోజుల్లో ఐలమ్మ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్ధిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని సౌకర్యాలతో మోడరన్ దోబీ ఘాట్​లను రజకుల సౌకర్యార్థం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్‌ను ప్రారంభించి డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశాల కార్యమానికి హాజరయ్యారు.