టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు పలు అంశాలను సూచించిన జోగయ్య

పవన్ కల్యాణ్ కు మరో బహిరంగ లేఖ రాసిన హరిరామజోగయ్య

harirama-jogaiah-letter-to-pawan-kalyan

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పటికే పలు లేఖలు రాసిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామజోగయ్య మరో లేఖ రాశారు. తాజా లేఖలో పలు అంశాలను ఆయన పవన్ దృష్టికి తీసుకెళ్లారు. టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో తాను సూచిస్తున్న అంశాలను పరిశీలించాలని ఆయన సూచించారు. జగన్ ను ఓడించాలంటే వైఎస్‌ఆర్‌సిపి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే మెరుగైన పథకాలను అమలు చేయాలని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు, ఇతర ఛార్జీలు భారీగా పెరిగాయని… వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు అందేలా చూడాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది వృద్ధులు ఉన్నా… నెలకు రూ. 4 వేల పెన్షన్ అందించాలని అన్నారు. తెల్లకార్డు ఉన్న కుటుంబాల్లోని 18 ఏళ్లు దాటిన విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రికల్ స్కూటీఅను ఇవ్వాలని చెప్పారు. విద్యుత్ బిల్లులపై 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.