నైజీరియాలో కాల్పుల మోత..43 మంది మృతి

అబుజా : నైజీరియాలో కాల్పుల మోత మోగింది. సోకోటో రాష్ట్రంలోని ఓ గ్రామ మార్కెట్‌పై సాయుధుడు చేసిన దాడిలో కనీసం 43 మంది మరణించారు. ఈ విషయాన్ని ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్సే నివేదించింది. గోరోనియో గ్రామంలో నిర్వహించిన వీక్లీ మార్కెట్‌లో సాయుధ బందిపోట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 43 మంది మరణించారు. ఈ విషయాన్ని సోకోటో ప్రభుత్వ ప్రతినిధి ముహమ్మద్ బెల్లో ధ్రువీకరించారు. ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

స్థానిక ప్రీమియం టైమ్స్ వార్తాపత్రిక ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ.. వీక్లీ మార్కెట్‌పై జరిగిన సాయుధ దాడిలో 30 మందికి పైగా మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. దాదాపు 200 మంది బందిపోటు ముఠా సభ్యులు మోటార్ సైకిళ్లపై మార్కెట్‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు వార్తాపత్రిక తెలిపింది. వాయవ్య నైజీరియా ప్రాంతంలో బందిపోట్లు గత ఏడాది కాలంగా రెచ్చిపోతున్నారు. బందిపోట్ల దాడి సమాచారం ఇచ్చేందుకు పోలీసులు తొలుత నిరాకరించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/