గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియః మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

పుకార్లను, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి

Gruha Lakshmi Don’t believe false propaganda.. Gruha Lakshmi continuous process : Minister Vemula

హైదరాబాద్‌ః తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన పథకం గృహలక్ష్మి పథకం. సొంతస్థలం ఉన్న లబ్దిదారులకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఈ పథకం కింద మూడు లక్షల రూపాయలు కేటాయించనుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. మొదటి విడత కేటాయింపులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల పదో తేదీ వరకే గడువు ఇవ్వడంతో ప్రభుత్వ కార్యాలయాల ముంగిట బారులు తీరారు. పదో తేదీ తర్వాత దరఖాస్తులు తీసుకోరన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పథకం గురించి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. వాటిని నమ్మొద్దని మంత్రి సూచించారు. ఖాళీ స్థలం ఉన్న ఎవరైనా సరే గృహలక్ష్మి కింద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చని పేర్కొన్నారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ల కేటాయింపులు ఉంటాయనీ, మిగతావారు రెండో దశలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు