13 మంది వీఐపీలకు భద్రత తొలగింపు

చంద్రబాబు సహా పలువురికి ఎన్ఎస్జీ భద్రత తొలగింపు

NSG upgrades security
NSG upgrades security

న్యూఢిల్లీ: టిడిపి అధినేత చంద్రబాబు సహా దేశం మొత్తం మీద 13 మంది ప్రముఖులకు కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రతను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై వీరందరి సెక్యూరిటీని పారా మిలిటరీ దళాలు చూస్తాయని స్పష్టం చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోదఫా అధికారాన్ని చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా 350 మంది వీఐపీలకు భద్రతను తగ్గించిన సంగతి తెలిసిందే. సోనియా గాంధీ ఫ్యామిలీ, మన్మోహన్ సింగ్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే గడచిన 20 సంవత్సరాలుగా బ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలుచుకునే ఎన్ఎస్జీ బృందాలు, వీఐపీల భద్రతలో ఉందన్న సంగతి తెలిసిందే. జడ్ ప్లస్ విభాగంలో ఉన్న వారందరి భద్రతనూ వీరు పర్యవేక్షిస్తున్నారు.

ఒక్కొక్కరికీ 25 మంది బ్లాక్ క్యాట్ కమాండోల చొప్పున భద్రతను కేంద్రం కల్పించగా, ఈ వీఐపీల జాబితాలో చంద్రబాబుతో పాటు రాజ్ నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, శర్వానంద సోనోవాల్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ఎల్కే అద్వానీ, ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులున్నారు. 1984లో హైజాక్ ఆపరేషన్స్ కోసం ఈ దళాన్ని ఏర్పాటు చేశామని, ప్రముఖుల భద్రత వీరి పరిధిలోనిది కాదని, ఈ బాధ్యతలు అదనపు భారం కావడంతోనే వారిని తప్పించామని హోమ్ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 450 మంది ఎన్ఎస్జీ కమాండోలు అందుబాటులోకి వస్తారని అన్నారు. ఇండియాలో ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున, వీరిని ఆయా ప్రదేశాలకు హుటాహుటిన తరలించడానికి అనువుగా, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/