కేసీఆర్ తో పనిచేయడం చాల కష్టం – గవర్నర్ తమిళి సై

గత కొద్దీ రోజులుగా తెరాస గవర్నమెంట్ కు గవర్నర్ తమిళి సై మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెరాస ప్రభుత్వం తనను లెక్క చేయడం లేదని , ఓ గవర్నర్ అనే మర్యాద ఇవ్వడం లేదని , ఎక్కడికి వెళ్లిన అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదని కేంద్రానికి తెలిపిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎక్కడికైనా వెళ్లాలంటే… రోడ్డుమార్గమే గతి అంటూ తనకు హెలికాప్టర్ కేటాయించకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించడం జరిగింది.

తాజాగా మరోసారి గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి పని చేయడం కష్టమని అన్నారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..సీఎం చెప్పారని ప్రతీ ఫైల్ పై సంతకం చేయడానికి నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ని కాదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సీఎంలు నియంతలుగా మారుతున్నారని… ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తమిళి సై అన్నారు. నేను ఇద్దరు సీఎంలతో పనిచేస్తున్నానని, తెలంగాణ, పుదుచ్చేరి సీఎంలు భిన్నమైన వారని… వారితో పనిచేసిన తర్వాత ఎక్కడైనా పనిచేయగలననే నమ్మకం వచ్చిందని అన్నారు. తనను మరో రాష్ట్రానికి మారుస్తారన్నది నిజం కాదని స్పష్టం చేశారు. ఎవరు గవర్నర్‌గా ఉన్నా.. ప్రోటో​కాల్‌ పాటించాల్సిందేనని తెలిపారు. రాజ్‌భవన్‌ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదని అన్నారు. ఏ విభేదాలు ఉన్నా, చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్‌ తమిళిసై అన్నారు.