ఎంపీగా నయా పైసా తీసుకురాని బండి సంజయ్‌కి ఓటు అడిగే హక్కు లేదుః గంగుల కమలాకర్

చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలన్న గంగుల కమలాకర్

gangula-kamalakar-says-bandi-sanjay-will-not-win

హైదరాబాద్‌ః బిజెపి నేత బండి సంజయ్ మూడోసారి ఘోరంగా ఓడిపోతారని బిఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఓడిపోతాననే భయంతో డబ్బులు పంచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… కరీంనగర్ ప్రజలు ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారన్నారు. అభివృద్ధి కోసం ఎంపీగా నయా పైసా తీసుకురాని బండి సంజయ్‌కి ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. ఆయన ఈసీ నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు. నిన్న ప్రచారం గడువు ముగిసిన తర్వాత డబ్బులు పంచేందుకు వెళ్లాడన్నారు.

అక్కడి ప్రజలు తిరగబడేసరికి బిఆర్ఎస్ డబ్బులు పంచుతోందని తిరిగి తమ పైనే బురద జల్లడం ప్రారంభించారని మండిపడ్డారు. ఈ విషయమై భాగ్యలక్ష్మీ దేవాలయం ముందు తడిబట్టలతో ప్రమాణం చేస్తావా? అని సవాల్ విసిరారు. ఇద్దరం తడిబట్టలతో వెళ్దాం… రావాలన్నారు. మద్యం, డబ్బులు పంచుతూ బండి సంజయ్ మనుషులు పట్టుబడ్డారని చెప్పారు. ఎమ్మెల్యే కాకముందే ఇంత గూండాయిజమా? అని వ్యాఖ్యానించారు. చేసిన అభివృద్ధిని చూపించి ఎవరైనా ఓట్లు అడగాలని… కానీ డబ్బులు పెంచి, ప్రజలను మభ్యపెట్టి కాదన్నారు.