గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌!

French President Macron to grace Republic Day event in Delhi as chief guest

న్యూఢిల్లీః వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ శుక్రవారం నివేదించింది. మాక్రాన్‌ను రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్‌ ఆహ్వానించినట్లు పేర్కొంది.

కాగా, ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరు కావాల్సి ఉంది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా బైడెన్‌తో ప్రధాని మోడీ మాట్లాడారని, గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు మనదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి గతంలో వెల్లడించారు. మోడీ ఆహ్వానాన్ని బైడెన్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. దీంతో గణతంత్ర వేడుకలను బైడెన్‌ ముఖ్య అతిథిగా వస్తారని అంతా భావించారు. అయితే, ఆయన ఈ వేడుకలకు హాజరుకాకపోవచ్చని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మాక్రాన్‌ను భారత్‌ ఇన్వైట్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా, గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్‌ తన మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం 1950 నుంచి సంప్రదాయంగా వస్తోన్న విషయం తెలిసిందే.